కేటీఆర్.. మీ ఆస్తుల పెరుగుదల పై ప్రజలకు నిజాలు చెప్పాలి : ఎంపీ వంశీకృష్ణ

కలం, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన గత పాలకులు, ముఖ్యంగా మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) , తమ పాలనలో సాధించిన అభివృద్ధితో పాటు తమ వ్యక్తిగత ఆస్తుల పెరుగుదల(Personal Assets) పై కూడా ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ (MP Gaddam Vamsi Krishna) డిమాండ్ చేశారు.

తెలంగాణ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కలిగిన ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్, తన కుటుంబానికి సంబంధించిన కంపెనీలు, వాటి ఆదాయాలు, వ్యాపార లావాదేవీలు, ఆస్తుల పెరుగుదలపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం, గతంలో సుమారు రూ.5 కోట్లుగా ఉన్న ఆస్తులు నేడు రూ.125 కోట్ల స్థాయికి ఎలా చేరుకున్నాయో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ ఆస్తుల పెరుగుదలకు సంబంధించిన ఆదాయ వనరులు, వ్యాపార లావాదేవీలు, కంపెనీల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో కుటుంబానికి సంబంధించిన కంపెనీల సంఖ్య, వాటి వ్యాపార కార్యకలాపాలు, ఆదాయాలు, లాభాలు ఎలా పెరిగాయనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు. కంపెనీల టర్నోవర్, ఆస్తుల పెరుగుదలపై వస్తున్న ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పాలని కోరారు.

ఒకవైపు తెలంగాణ యువతకు సోషల్ మీడియా ద్వారా భారీ ప్రచారం చేస్తూ, రీల్స్, బ్రాండింగ్ పేరుతో యువతను ఆకర్షిస్తున్న నాయకత్వం, మరోవైపు అదే యువతకు నాణ్యమైన ఉద్యోగాలు, పరిశ్రమల్లో అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ యువత సోషల్ మీడియా వారియర్లుగా మాత్రమే మిగిలిపోవాలా? లేక ఉద్యోగాలు, ఉపాధి, పారిశ్రామిక అవకాశాలు పొందే స్థాయికి ఎదగాలా? అని ప్రశ్నించారు.

గత పదేళ్ల పాలనలో ఎలాంటి అక్రమాలకు, అవినీతికి, భూకబ్జాలకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడలేదని మాజీ మంత్రి భావిస్తే, తన ఆస్తుల పెరుగుదల వెనుక ఉన్న ఆదాయ వనరులను ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజాప్రతినిధులు తమ ఆస్తులు, వ్యాపారాలు, ఆదాయాల విషయంలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

“తెలంగాణ యువతకు నిజాలు తెలుసుకునే హక్కు ఉంది. ప్రజల తరఫున అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మాజీ ఐటీ మంత్రి కేటీఆర్‌పై ఉంది. మాటలతో కాకుండా ఆధారాలతో ప్రజలకు వివరించాలి” అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పదవిలో ఉండి వందల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో సమాధానం చెప్పాలి.

ఐటీ మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెట్టుబడిదారులపై ఒత్తిడి తెచ్చి, తమ కంపెనీల్లో వాటాలు లేదా బినామీ మార్గాల్లో ఆస్తులు పెంచుకున్నారనే ఆరోపణలపై కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ మీ కంపెనీలకు వచ్చిన వందల కోట్ల టర్నోవర్, ఆస్తుల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ప్రజలకు సమాధానం చెప్పండి అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూటిగా సవాల్ విసిరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>