కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల (Bellampalli Police) నిర్వాకం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉండాల్సిన కొందరు పోలీసు సిబ్బంది నిబంధనలను గాలికొదిలేసి ప్రైవేట్ వేడుకల్లో మునిగిపోయారు. పోలీస్ స్టేషన్ రికార్డుల్లో తాము ఆన్ డ్యూటీలో ఉన్నట్లు నమోదు చేసుకుని, విధులకు దూరంగా ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది.
అక్కడ మద్యం మత్తులో వారంతా ఉత్సాహంగా చిందులు వేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలా వ్యవహరించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

