కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.28.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. అదేవిధంగా రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను కూడా ప్రారంభించారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థుల చదువులు, కళాశాలలో అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో 400కు పైగా మార్కులు సాధించేలా కష్టపడి చదవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలను కూడా పెంపొందించాల్సిన అవసరం ఉందని, కళాశాలలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యా, క్రీడా రంగాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భవానీ, సింగిల్ విండో ఛైర్మన్ రవీందర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

