కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ (Banjara Hills)లో ఓ వివాదాస్పద స్థలంలో ఏపీ ఎంపీ హల్చల్ చేశాడు. స్థానికంగా భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎంపీ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గామారింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీ స్థలం ఉంది. ఈ స్థలం చుట్టూ కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) స్థలం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న వాళ్లందరినీ చెదరగొడుతూ తన మనుషులతో వీడియోలు తీయించారు. ఈ స్థలానికి సంబంధించిన గొడవ బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్‌కు చేరుకుంది. సర్వే నంబర్ 129లో ప్లాట్ నంబర్ 29, 30లో ఉన్న భూమిని 2006లోశివ నారాయణ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. దీన్ని సీఎం రమేష్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. సీఎం రమేశ్ స్థలం వద్ద హల్చల్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఈ భూ వివాదంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాలి.

