‘యంగ్ ఇండియా’ కాస్తా ‘ఏజ్డ్ ఇండియా’: మూడీస్ షాకింగ్ రిపోర్ట్!

కలం, నేషనల్ డెస్క్ : మనది యంగ్ ఇండియా.. ప్రపంచంలోనే ఎక్కువ మంది యువత ఉన్న దేశం.. ఈ యువశక్తే నవ భారత నిర్మాణానికి అతిపెద్ద ఇంధనం.. యువ జనాభాతో భారత్‌ తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.. ప్రతి వేదికపై ప్రధాని మోదీ సగర్వంగా చెప్పే మాటలివీ.. కానీ అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ‘మూడీస్’ విడుదల చేసిన నివేదిక (Moody’s Report) అందుకు భిన్నంగా ఉన్నది. ‘యంగ్ ఇండియా’ కాస్తా ‘ఏజ్డ్ ఇండియా’గా మారుతున్నదని హెచ్చరించింది.

సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. పరిస్థితి ఇలాగే ఉంటే 2049 నాటికి ఏజ్డ్‌, 2065 నాటికి సూపర్‌ ఏజ్డ్‌ ఇండియాగా మారుతుందని హెచ్చరించింది. భారత్‌ ధనిక దేశంగా ఎదగకముందే ‘వృద్ధ భారత్‌’గా మారే ముప్పు పొంచి ఉన్నదని వార్నింగ్ ఇచ్చింది.

దేశంలో సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేటు) వేగంగా పడిపోతున్నది. జనాభా సమతుల్యతను కాపాడే ‘రీప్లేస్మెంట్ లెవెల్’ కంటే ఇది ఇప్పటికే దిగువకు చేరిందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ‘మూడీస్’ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరినాటికి భారత్లో వృద్ధుల జనాభా భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

పూర్తి స్థాయి ధనిక దేశంగా మారకముందే భారత్ వృద్ధాప్యం వైపు వేగంగా అడుగులు వేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి (UN) అంచనాల ప్రకారం.. రాబోయే 16 ఏళ్లలో (అంటే 2042 నాటికి) భారత్ అధికారికంగా వృద్ధ దేశాల జాబితాలోకి చేరిపోనుంది. 2046 నాటికి దేశంలో పిల్లల కంటే వృద్ధుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది.

బడ్జెట్పై భారీ ఆర్థిక భారం

అభివృద్ధి చెందిన దేశాలు (ఉదాహరణకు జపాన్) ధనిక దేశాలుగా మారిన తర్వాత వృద్ధాప్య సమస్యను ఎదుర్కొన్నాయి. కానీ, దేశం ఇంకా మధ్యతరగతి ఆదాయ స్థాయిలోనే ఉండగానే ఈ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దీనివల్ల దేశంలో పెన్షన్లు, ఉచిత వైద్యం, వృద్ధుల సంరక్షణ ఖర్చులు ప్రభుత్వ బడ్జెట్పై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపనున్నాయి.

ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ‘యూఎన్ఎఫ్‌పీఏ’ నివేదిక ప్రకారం.. భారత్లోని వృద్ధులలో 40 శాతం కంటే ఎక్కువ మంది అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. పైగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలుగా మారడం వల్ల వృద్ధులకు సాంప్రదాయ కుటుంబ మద్దతు కూడా కరువవుతున్నది.

ఏపీలో ముగ్గురు పిల్లల నినాదం

దేశం అంతటా జనాభా మార్పులు ఒకేలా లేవని, దేశం రెండు భిన్నమైన వేగాలతో ప్రయాణిస్తున్నని ఈ నివేదిక పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు ఇంకా కాస్త ఎక్కువగా ఉన్నందున అక్కడ వృద్ధుల శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంటుంది. కానీ, దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే వృద్ధాప్యం వైపు వేగంగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో 1992-93 మధ్య 3.0గా ఉన్న సంతానోత్పత్తి రేటు.. ఇప్పుడు ఏకంగా 1.5కి పడిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయడమే కాకుండా, ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలని ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తున్నది.

అంచనా వేయలేని స్థాయిలో వృద్ధుల సంఖ్య

యూఎన్ అంచనాల ప్రకారం.. 2050 నాటికి భారత్లో వృద్ధుల జనాభా 134 శాతం పెరగనుంది. మరీ ముఖ్యంగా, అత్యంత ఎక్కువ సంరక్షణ అవసరమయ్యే 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య ఏకంగా 279 శాతం పెరగబోతున్నది. ఇంత భారీ స్థాయిలో పెరగబోయే వృద్ధులకు అవసరమైన ఆసుపత్రులు, నర్సులు, మందులు, అసిస్టెడ్ లివింగ్ సౌకర్యాలు ప్రస్తుతం మన దేశంలో అత్యంత అల్పంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం జపాన్ అత్యంత వృద్ధ దేశంగా మారింది. అక్కడ దాదాపు 30 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. దక్షిణ కొరియా, చైనాలు కూడా అదే దిశగా వేగంగా దూసుకుపోతున్నాయి. ఇవే కాకుండా బ్రెజిల్, థాయిలాండ్, తుర్కియేతో పాటు భారత్ కూడా ఇప్పుడు ఇదే వృద్ధాప్య మార్గంలో పయనిస్తున్నదని మూడీస్ రేటింగ్స్ నివేదిక హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>