కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామ పరిధిలోని పిట్టలగూడెంలో నివసిస్తున్న సంచార జాతుల ప్రజలను అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారంటూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత (Gongidi Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల జీవనోపాధికి సంబంధించిన వేట సామగ్రిని సైతం అధికారులు తీసుకెళ్లారని ఆరోపించారు. అధికారుల తీరుతో సంచార జాతుల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. అడవి బిడ్డల జీవన పరిస్థితులను అర్థం చేసుకోకుండా వారిని భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. అటవీ సంరక్షణతో పాటు అక్కడి ప్రజల జీవనోపాధి, హక్కుల అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
అడవిని కాపాడటం ఎంత ముఖ్యమో.. అడవిపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల బతుకులను కాపాడటం కూడా అంతే ముఖ్యమని గొంగిడి సునీత పేర్కొన్నారు. పిట్టలగూడెం ప్రజల సమస్యలను పరిష్కరించి, అటవీశాఖ అధికారుల వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పిట్టలగూడెం అడవి బిడ్డలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గొంగిడి సునీత స్పష్టం చేశారు. వారి సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని కోరారు.

