పదవులన్నీ వారికేనా? : నల్లగొండ కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి!

కలం, నల్లగొండ బ్యూరో: “జనాభా ప్రతిపాదికన వాటా.. ఎంతమంది ఉంటే అధికారంలో అంత ప్రాతినిథ్యం”.. కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయంపై చేసే నినాదం ఇది. కానీ ఉమ్మడి నల్లగొండ (Nalgonda Congress) జిల్లాలో ఆ నినాదం పూర్తిగా రివర్స్ అవుతోంది. ఓట్ల వేటలో బీసీలు.. పదవుల వేటలో ‘పెద్ద రెడ్లే’ అన్నచందం గా జిల్లా రాజకీయ సమీకరణాలు మారాయ నే తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. చట్టసభల నుంచి మొదలుకొని స్థానిక నామినేటెడ్ పోస్టుల వరకు అధికారం మొత్తం ఒకే సామాజిక వర్గం చేతుల్లో బందీ కావడంపై ఉమ్మడి జిల్లాలోని బీసీ, ఎస్సీ నేతల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది.

అసెంబ్లీ నుంచి ఎంపీల వరకు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లలో కాంగ్రెస్ 11 గెలుచుకుంది. ఇందులో రిజర్వుడు స్థానాలు (2 ఎస్సీ, ఒకటి ఎస్టీ) పోగా, మిగిలిన 8 జనరల్ స్థానాల్లో ఏడుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క బీసీ ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఇక్కడితో ఆగకుండా ప్రభుత్వ, రాజ్యాంగ పదవుల్లోనూ వారిదే ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర కేబినెట్‌లో జిల్లాకు దక్కిన ఇద్దరు మంత్రులు (ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి) అదే సామాజికవర్గం. పార్లమెంట్ ప్రాతినిథ్యంలోనూ నల్లగొండ (రఘువీర్ రెడ్డి), భువనగిరి (చామల కిరణ్‌కుమార్ రెడ్డి) ఎంపీ స్థానాల్లోనూ రెడ్డిలే ఉన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం ఇదే జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం.

రెండో తరానికీ సారథ్యం?

మొదటి తరం సీనియర్ల వారసులకు కూడా అడ్డంకులు లేకుండా పదవుల తివాచీలు పరుస్తుండటంపై ద్వితీయ శ్రేణి నాయకత్వంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జానా రెడ్డి ఇద్దరు కుమారుల్లో నల్లగొండ ఎంపీగా రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా జయవీర్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్ పదవిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి కట్టబెట్టారు.

తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసులో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కొడుకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ప్రకటించడం పార్టీలోని బీసీ వర్గాలకు మింగుడుపడడం లేదు. అంతేకాకుండా పటేల్ రమేష్ రెడ్డి వంటి నేతలకు నామినేటెడ్ పొజిషన్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వడం, మళ్లీ సూర్యాపేట ఇన్ చార్జ్ పదవికి పోటీ పడుతుండటంతో ఆశలు అడియాసలయ్యాయని ద్వితీయ శ్రేణి బీసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ స్థానాల్లోనూ పెద్దల పెత్తనమే..

జనరల్ స్థానాల్లోనే కాదు.. రిజర్వుడ్ ఎస్సీ సీట్లలో కూడా రెడ్డి సామాజికవర్గ ముఖ్య నేతల పెత్తనమే సాగుతుందని స్థానిక దళిత నేతలు వాపోతున్నారు. గుడి చైర్మన్, బడి చైర్మన్, సొసైటీ అధ్యక్షుల నుంచి మున్సిపల్ పదవుల వరకు ఏ చిన్న పదవి కావాలన్నా.. ‘పెద్ద రెడ్ల’ ఆశీస్సులు లేనిదే ఏ పని కావడం లేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒకవేళ ఏవరైనా బీసీ లేదా ఎస్సీ నేత స్వశక్తితో, అధిష్టానంతో మాట్లాడి పదవి తెచ్చుకున్నా.. జిల్లాలోని పెద్ద నేతలు వారికి సహకరించకుండా మూడేళ్లపాటు ముప్పుతిప్పలు పెడుతున్నారనే వాదనలు ఉన్నాయి.

రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న ‘జనాభా- సామాజిక న్యాయం’ సిద్ధాంతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో ఏమాత్రం అమలు కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మా ఓట్లు కావాలి.. మేం జెండాలు మోయాలి.. కానీ పదవుల దగ్గరికి వచ్చేసరికి మాకు ‘నో’ చెప్తారా?’ అని బీసీ నేతలు అంతర్గత సమావేశాల్లోనే ప్రశ్నిస్తున్నారు. రాబోయే రెండో విడత నామినేటెడ్ పదవుల్లో, అలాగే త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే, ఉమ్మడి జిల్లాలో అంతర్గత పోరు పార్టీకి ముప్పుగా ఉందనే ప్రచారమూ ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>