కలం, భువనగిరి: దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడం తీవ్రంగా ఖండించదగినదని CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti Satyam) అన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బుధవారం భువనగిరిలోని (Bhuvanagiri) రాఘవేంద్ర కన్వెన్షన్ హాల్‌లో CPI యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండీ ఇమ్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు చర్చల మార్గాన్ని అనుసరించాల్సిన ప్రభుత్వం, నిరసనలను అణచివేసే ధోరణి అవలంబించడం తగదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, విద్యా రంగంలో పారదర్శకత తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని నెల్లికంటి సత్యం (MLC Nellikanti Satyam) ఆరోపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిపి తగిన పరిష్కారాలు చూపాలని డిమాండ్ చేశారు.
అఖిల భారత యువజన సమాఖ్య (SFI) తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్ట ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో CPI జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, రాష్ట్ర సమితి నాయకులు గోద శ్రీరాములు, కురిమిద్ద శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ ప్రతినిధులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, అరే పుష్ప తదితరులు పాల్గొన్నారు.
Read Also: కామన్వెల్త్ గేమ్స్: సాజన్ ప్రకాశ్ అవుట్!
Follow Us On : WhatsApp

