కలం, వనపర్తి: గురు పౌర్ణమి (Guru Purnima) సందర్భంగా వనపర్తి మండలం కొత్తకోట శివారులోని శ్రీ సాయిబాబా ఆలయంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, సమాజానికి సన్మార్గం చూపే గురువులను స్మరించుకోవడమే గురు పౌర్ణమి విశిష్టత అని అన్నారు. భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయంలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల తర్వాత జ్ఞానం, వివేకం, విలువలు, సంస్కారం, ధర్మం, కర్తవ్యబోధ నేర్పి జీవితానికి సరైన దిశను చూపే మహోన్నత వ్యక్తి గురువని చెప్పారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకొని జరుపుకునే గురు పౌర్ణమి (Guru Purnima) జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని వివరించారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదించే ప్రతి గురువును ఈ పవిత్ర దినాన కృతజ్ఞతతో స్మరించుకోవడం భారతీయ సంస్కృతిలో గొప్ప సంప్రదాయమని తెలిపారు.
శ్రీ షిర్డీ సాయిబాబా బోధించిన “సబ్కా మాలిక్ ఏక్”, ప్రేమ, సేవ, మానవత్వం, సమానత్వం వంటి విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని సూచించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
Follow Us On : WhatsApp

