ప్రతి విద్యార్థికి నాణ్యమైన యూనిఫామ్స్​ : ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన యూనిఫామ్స్​ అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ నగరంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని వివేకానంద మహిళా కమిటీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నగరంలోని మహిళా సంఘాల సభ్యుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేయడానికి తయారు చేస్తున్న స్కూల్ యూనిఫాంలను ఎమ్మెల్యే పరిశీలించారు. యూనిఫాంల తయారీలో ఉపయోగిస్తున్న మెటీరియల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యుల చేత 15 రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు 91 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మొత్తం 11,800 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలను అందించనున్నట్లు తెలిపారు. ఈ యూనిఫాం తయారీ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, సుమారు నాలుగు నెలల వ్యవధిలో ఒక్కొక్కరికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఇక్కడ సుమారు 250 మంది టైలర్లు తమ వీలును బట్టి పనిచేస్తున్నారని, ఒక్క యూనిఫాం కుట్టడానికి రూ.75 చొప్పున పారితోషికం అందుతున్నట్లు వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు సంవత్సరం పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల డ్రెస్ కొలతలను ముందుగానే మహిళా సంఘాల సభ్యులే స్వయంగా సేకరిస్తున్నారని మహిళా సంఘాల సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్ పి వెంకటేష్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు శేఖర్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>