కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో పెరుగుతున్న వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా నూతన పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తెచ్చామని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. టవర్ సర్కిల్ సమీపంలో ఇటీవలే అధునీకరించిన ఐడీఎస్ఎంటీ భవనం షాపింగ్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ స్థలం ఉందన్నారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా..
సోమవారం నుంచే పార్కింగ్ సదుపాయాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ వివరించారు. ప్రధాన వాణిజ్య ప్రాంతమైన టవర్ సర్కిల్ ఏరియా, కూరగాయల మార్కెట్ ప్రాంతంలో రోడ్ల పై యథేచ్ఛగా వాహనాలను నిలపడం వలన ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందన్నారు. అందుకోసమే అధునాతన ఐడీఎస్ఎంటీ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ స్థలం వినియోగంలోకి వచ్చిందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పార్కింగ్ ఛార్జీలు ఇలా..
ద్విచక్ర వాహనం: రెండు గంటలు పార్కింగ్ చేస్తే రూ.10, మూడు గంటలకు రూ.15, నాలుగు గంటలకు రూ.20, అయిదు గంటలకు రూ.25, ఆరు గంటలకు రూ.30, 12 గంటలకు రూ.35, 24గంటలకు రూ.40 తీసుకుంటారు.
మూడు చక్రాల వాహనం: రెండు గంటలు పార్క్ చేస్తే రూ.15, మూడు గంటలకు రూ.20, నాలుగు గంటలకు రూ.30, అయిదు గంటలకు రూ.40, ఆరు గంటలకు రూ.50, 12 గంటలకు రూ.60, 24 గంటలకు రూ.70 తీసుకుంటారు.
నాలుగు చక్రాల వాహనం: రెండు గంటలకు రూ.20, మూడు గంటలకు రూ.30, నాలుగు గంటలకు రూ.40, అయిదు గంటలకు రూ.50, ఆరు గంటలకు రూ.60, 12 గంటలకు రూ.70, 24గంటలకు రూ.100గా నిర్ణయించారు.

