ఎల్‌నినోపై ముందస్తు అప్రమత్తత అవసరం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

కలం, గోదావరిఖని : రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ (MLA Raj Thakur) ఈరోజు గోదావరిఖని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి, అంతర్గాం మండలాల సర్పంచులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్‌నినో ఆందోళనలతో (Nino Concerns) రాబోయే రోజుల్లో నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులను ముందస్తుగా అప్రమత్తం చేయాలని సూచించారు.

ప్రతి రైతుకు పరిస్థితులను అర్థమయ్యేలా వివరించి, నీటిని పొదుపుగా వినియోగించుకోవడం, చెరువులు, కుంటలను సంరక్షించడం, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి 4.5 టీఎంసీల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.

ఎల్‌నినోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొడుతూ, ప్రకృతి సంబంధిత పరిస్థితులను రాజకీయాలకు ముడిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని అన్నారు. పెద్దపల్లి జిల్లాకు ఎలాంటి నష్టం కలగకుండా రైతులకు, ప్రజలకు అండగా నిలిచే బాధ్యతను తాము తీసుకుంటామని, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి అవసరమైన చర్యలకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రాధాన్యం ఇస్తూ ఒక్కో గ్రామానికి సుమారు 130 ఇళ్ల వరకు మంజూరు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ చేరేలా నాయకులు కృషి చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ రహదారుల నిర్మాణంతో పాటు పంచాయతీరాజ్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజల సొమ్మేనని, నిధులు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకే వినియోగించేలా పర్యవేక్షించాలని కోరారు.

ప్రజల సంక్షేమం, రైతుల భద్రత, గ్రామాల అభివృద్ధే మా లక్ష్యం. ప్రతి గ్రామానికి రాజ్ ఠాకూర్ వస్తాడు.. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తాడు అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాలకుర్తి, అంతర్గాం మండలాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>