కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, సీఎల్పీ మీడియా సెంటర్ ఇన్చార్జ్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) పిలుపునిచ్చారు. గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కేడర్ అంతా ఢిల్లీ బాట పడుతుంటే, అమిత్ షా మాత్రం గల్లీ బాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని, అందుకే ఆ పార్టీ నేతలు భయపడి హైదరాబాద్లో పాదయాత్రలకు వస్తున్నారని అన్నారు.
ఎన్నికల సంఘంతో కలిసి ఎస్ఐఆర్ (SIR) పేరుతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని అద్దంకి దయాకర్ ఆరోపించారు. దేశంలో జనాభా పెరుగుతున్నప్పటికీ, ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఇప్పటివరకు 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఓటు హక్కు కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాటిని తొలగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు తొలగించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమేనని విమర్శించారు. మోదీ, అమిత్ షాలకు ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియదని, ప్రజాస్వామ్యంలో మోదీ కాదు కదా ఆయన అబ్బ అయినా దిగిపోవాల్సిందేనని హెచ్చరించారు.
ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ దేశంలో 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదని ఆరోపించారు. చంద్రబాబు, నితీష్ కుమార్ పుణ్యాన మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఇప్పుడు మళ్లీ నిధుల పేరుతో మభ్యపెడుతోందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావాలని కోరిన ఆయన, బీజేపీతో పొత్తు విష కౌగిలి లాంటిదేనని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య పొత్తు చర్చలు జరుగుతున్నాయని ఆరోపించారు. నవంబర్ 1న రాంలీలా మైదానంలో జరిగే సభకు పోటీగా హైదరాబాద్లో అమిత్ షా పాదయాత్ర తలపెట్టినా, ప్రజల చేతిలో బీజేపీకి ఓటమి తప్పదని అద్దంకి దయాకర్ అన్నారు.

