కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా డీసీసీ భవన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ (Errabelli Swarna) అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు (MLA Nagaraju) పాల్గొని మహిళా సాధికారతపై కాంగ్రెస్ పార్టీ పాత్రను విశదీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, కుడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు(MLA Nagaraju) మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతి, రాజకీయ భాగస్వామ్యం, నాయకత్వ వికాసానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో కృషి చేస్తోందని తెలిపారు. మహిళలకు అధికారంలో, పాలనలో, ప్రజాస్వామ్యంలో కీలక స్థానాలు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని ఆయన గుర్తు చేశారు. దేశ అభివృద్ధి, భద్రత, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠను పెంచడంలో ఆమె పాత్ర చారిత్రాత్మకమని ప్రశంసించారు.
అలాగే దేశ అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్రపతి స్థానంలో కూడా మహిళకు అవకాశం కల్పించడం ద్వారా మహిళా గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయేనని ఆయన తెలిపారు. మహిళలకు శాసనసభలు, పార్లమెంట్‌లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: రాత్రి 8.30 గంటలకు ప్రధాని ప్రసంగం
Follow Us On: Sharechat

