‘రామగుండం’ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

కలం, కరీంనగర్ బ్యూరో: రామగుండం (Ramagundam) నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ (MLA Makkan Singh Raj Thakur) తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎన్‌టీపీసీ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల వైపు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.

ఇందులో భాగంగానే రామగుండం నియోజకవర్గానికి సమీకృత పాఠశాల మంజూరైందని, త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల మౌలిక వసతులతో పాఠశాలలను అభివృద్ధి చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తన ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని, సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

విద్యార్థులకు ఎన్‌టీపీసీ విద్యుత్ సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద సైకిళ్ల పంపిణీ చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా 500 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెళ్లి ఎల్లయ్య, ఎంఈఓ మల్లేష్‌తో పాటు నగర కార్పొరేటర్లు, అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>