నావికుల భద్రతకు అధిక ప్రాధాన్యం: ప్రధాని మోదీ

కలం, నేషనల్ డెస్క్: ప్రపంచ వాణిజ్యం సజావుగా సాగాలంటే సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండాల్సిందేనని ప్రధాని మోదీ (PM Modi) స్పష్టం చేశారు. నావికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇటీవల హర్మూజ్ జలసంధి సమీపంలో భారతీయ నౌకలపై జరిగిన దాడులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని పునరుద్ఘాటించారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ప్రధాని మాట్లాడుతూ.. సముద్ర మార్గాల్లో అంతరాయాలు ఏర్పడితే అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

బ్రిక్స్‌ బలం పెరుగుతోంది…

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ కూటమి దేశాల ప్రాధాన్యత నానాటికీ పెరుగుతోందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచ సగటు జీడీపీ వృద్ధి రేటు కంటే బ్రిక్స్ దేశాల సంయుక్త జీడీపీ దాదాపు రెండింతలు వేగంగా దూసుకుపోతుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 50 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటాను కలిగి ఉండటంతో పాటు, అంతర్జాతీయ వాణిజ్యంలో 25 శాతానికి పైగా భాగస్వామ్యాన్ని బ్రిక్స్ దేశాలే శాసిస్తున్నాయని గణాంకాలతో వివరించారు.

భారత్‌లో స్టార్టప్‌ల విప్లవం..

ప్రస్తుతం భారత్‌లో స్టార్టప్ విప్లవం నడుస్తోందని, ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం వాటా ఒక్క యూపీఐ ప్లాట్‌ఫారాల ద్వారానే సాగుతోందని ప్రధాని మోదీ గర్వంగా ప్రకటించారు. దీనికి అద్దం పడుతూ భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ‘భారత్ ఇన్నోవేట్స్’ డీప్టెక్ ప్రదర్శనలో దేశీయంగా ఎంపిక చేసిన 37 అగ్రశ్రేణి స్టార్టప్స్‌ను అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోసం ప్రదర్శించారు. బిజినెస్ ఫోరమ్ ప్రారంభమైన కేవలం 5 గంటల్లోనే రికార్డు స్థాయిలో 600కు పైగా బీ2బీ (బిజినెస్-టు-బిజినెస్) సమావేశాలు జరగడం గమనార్హం.

జీ7 కూటమిపై పుతిన్ వ్యంగ్యాస్త్రాలు..

బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. గ్లోబల్ ఎకానమీలో వస్తున్న విప్లవాత్మక మార్పులను గణాంకాలతో సహా వివరించారు. గత ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయిన జీడీపీలో 40 శాతానికి పైగా బ్రిక్స్ దేశాల నుంచే రాగా, పాశ్చాత్య దేశాల జీ7 కూటమి వాటా కేవలం 29 శాతానికే పరిమితమైందని పుతిన్ ఎద్దేవా చేశారు.

పాశ్చాత్య దేశాలు తమ పూర్వ ఆధిక్యాన్ని కోల్పోతూ.. ఆస్తుల జప్తు, పైపు లైన్ల ధ్వంసం వంటి అనాగరిక పద్ధతులకు పాల్పడుతున్నాయని పుతిన్ మండిపడ్డారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. 2003లో 900 బిలియన్ డాలర్లుగా ఉన్న బ్రిక్స్ ఎగుమతులు 2024 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు చేరాయని, ప్రపంచ ఎగుమతుల్లో కూటమి వాటా 24 శాతానికి పెరిగిందని వివరించారు.

డాలర్ రహిత వాణిజ్యానికి ఇరాన్ పిలుపు..

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రధాని మోదీతో భేటీ అయి పశ్చిమాసియా భద్రత, రూపాయి-రియాల్ కరెన్సీ ఆధారిత వాణిజ్యంపై విస్తృతంగా చర్చించారు. అనంతరం బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో పెజెష్కియాన్ మాట్లాడుతూ.. అమెరికా ఏకపక్ష ఆంక్షలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆయుధంగా మార్చుకునే హక్కు ఏ దేశానికీ లేదన్నారు.

బ్రిక్స్ దేశాలన్నీ తమ స్వదేశీ కరెన్సీలను విస్తృతంగా వాడుతూ బలమైన ఆర్థిక నెట్‌వర్క్ నిర్మించాలని పెజెష్కియాన్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ పవన్ జోషి మాట్లాడుతూ.. తాము ప్రతిపాదిస్తున్న ‘బ్రిక్స్ పే’ వ్యవస్థ అంతర్జాతీయ కరెన్సీలను భర్తీ చేయడానికి కాదని, సభ్య దేశాల ఆర్థిక సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికేనని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>