కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2BHK ఇళ్లను అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు వెంటనే కేటాయించి సర్టిఫికెట్లు అందజేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar Reddy) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. తొగుట మండలం, దౌల్తాబాద్, దుబ్బాక, అక్బర్‌పేట్ ప్రాంతాలలో దాదాపు వెయ్యికి పైగా ఇళ్లు పూర్తయ్యాయని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి వెంటనే సర్టిఫికెట్లు అందజేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కోరారు.
ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సమస్యలను సమావేశంలో ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో దుబ్బాక నియోజకవర్గంలో నిర్మించిన ఏడు మండలాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, కొంతమంది లబ్ధిదారులు ఇప్పటికే రెండు నుండి రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇళ్లలో నివసిస్తున్నారని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక జరగకపోవడంతో ఇళ్లు నిర్మించి చాలా కాలం కావడంతో కొన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయని, మరికొన్ని దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కాంట్రాక్టర్ ఎక్కడ ఇళ్లు నిర్మించారు, పనులు పూర్తిగా జరిగాయా లేదా, బిల్లులు చెల్లించారా అనే అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి..
కొన్ని ప్రాంతాల్లో ఇంకా కిటికీలు, తలుపులు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో సుమారు 400 నుండి 500 వరకు ఇళ్లు ఇంకా కేటాయించకుండా ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే మంత్రి స్వయంగా నియోజకవర్గానికి వచ్చి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. గతంలో నిర్మించిన ఏడు మండలాలకు సంబంధించి 1081 ఇళ్ల అల్లాట్మెంట్ కోసం లెటర్ ఇచ్చినా అందులో 610 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, ఇంకా 471 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 262 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా కొన్ని గ్రామాల్లో ఇంకా బిల్లులు విడుదల కాలేదని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లలో దుబ్బాక నియోజకవర్గానికి అదనంగా మరో 2,000 ఇళ్లు కేటాయించాలని మంత్రిని, అధికారులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు.

