ఏపీలో సాగు నీటి కొరత.. పవన్‌తో నిమ్మల భేటీ

కలం, వెబ్ డెస్క్: సూపర్ ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ఏపీలో నెలకొన్న సాగునీటి కొరతపై రైతుల్లో అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి సూచించారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో సాగు నీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఈ తరుణంలో రైతన్నలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై పవన్ కల్యాణ్ తో మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తన భుజానికి గాయం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ను నిమ్మల పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలోని పలు నియోజకవర్గాల రైతుల కోసం ఏలేరు ప్రాజెక్టు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినందుకు నిమ్మల రామానాయుడుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రైతుల స్థితిని తెలుసుకునేందుకు కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నట్టు నిమ్మల వివరించారు.

ప్రకృతి విపత్తుల కారణంగా రైతన్నలు నష్టపోకుండా ప్రతి రైతు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా చేయించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. అవకాశం ఉన్న చోట రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>