కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో : కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె పార్టీ పెట్టడం ఒక “బిగ్ జోక్” అని, అది హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. కవిత రాజకీయ వైఖరిపై ఘాటైన విమర్శలు చేశారు. కవిత తన మొదటి సమావేశంలోనే ఉద్యమకారుడైన తండ్రి కేసీఆర్‌ను విమర్శించడం తనను ఎంతగానో బాధించిందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

‘ఒక ఉద్యమకారుడి బిడ్డనన్న విషయం ఆమెకు కేవలం గుర్తుకు మాత్రమే ఉంది. కూతురికి తండ్రి మీద ప్రేమ ఉండాలి. కానీ మొదటి సమావేశంలోనే తండ్రిని తిట్టి ఆమె తన మర్యాదను, గౌరవాన్ని పోగొట్టుకుంది’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తండ్రికి విలువ ఇవ్వని వ్యక్తి ప్రజలకు ‘అమ్మ’ ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. అన్న మీద ఉన్న కోపాన్ని తండ్రి మీద చూపించడం తప్పు అని హితవు పలికారు. మద్యం కుంభకోణం కేసు గురించి ప్రస్తావిస్తూ.. కవితకు ఆ కేసులో ఇంకా క్లీన్ చిట్ రాలేదని, ఆమె నిర్దోషి అని కోర్టు తేల్చలేదని గుర్తు చేశారు. కేసు ఇంకా కొనసాగుతుండగానే రాజకీయ ఆకాంక్షలు పెట్టుకోవడం సరికాదన్నారు.

డబ్బు ఉందన్న అహంకారంతో పార్టీలు పెట్టడం పాన్ షాప్ పెట్టినంత సులువు కాదని రాజగోపాల్ రెడ్డి చురకలంటించారు. “టిఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టడం మరో పెద్ద జోక్. ఆమెకు సొంతంగా పార్టీ పెట్టే స్థాయి లేదు, కనీసం ఒక చోట పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు,” అని ఆయన ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో తన రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం తనకు గతంలోనే హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తనకు ఏదైనా పెద్ద పదవి ఇస్తే, దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ అంశం చర్చనీయాంశంగా మారిన తరుణంలో రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>