సకాలంలో నిర్మాణాలు చేపట్టకుంటే రద్దు చేస్తాం: ఎమ్మెల్యే కవ్వంపల్లి

కలం, గన్నేరువరం: నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం గన్నేరువరం (Ganneruvaram) మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో 85 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేద కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ వారి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని తెలిపారు. మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు జరుపుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం దశలవారీగా విడుదల చేసే బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.

గన్నేరువరం మండల వ్యాప్తంగా మొత్తం 332 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పటివరకు 254 మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారని ఎమ్మెల్యే వివరించారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాలను గడువులోగా ప్రారంభించకపోతే ఆ అనుమతులను రద్దు చేసి ఇతర అర్హులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల వద్ద నిర్మాణానికి అవసరమైన డబ్బులు లేకపోయినా, మహిళా సంఘాల ద్వారా రూ.2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

అయితే తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించగలమనే నమ్మకాన్ని మహిళా సంఘాలకు కల్పించాల్సిన బాధ్యత లబ్ధిదారులపైనే ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని, ఎలాంటి పైరవీలకు తావులేదని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలదే కీలక బాధ్యత అని పేర్కొన్నారు. ఇళ్ల మంజూరు కోసం ఎవరూ ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతరం గన్నేరువరం గ్రామానికి సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయించారు. తదుపరి మండలానికి సంబంధించిన ఏడుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మాతంగి శిరీష, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ చిప్ప నరేందర్, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కట్కం తిరుపతి, సర్పంచులు శ్రీనివాస్, రేపాక బాణవ్వ, జంగిటి ప్రకాష్, గోపాల్ రెడ్డి, ఆకుల కవిత, చింతల ఉమారాణి, కాల్వ పద్మ, అనంతం, కర్నె చంద్రయ్య, గడ్డం రమ్య, కాంగ్రెస్ నాయకులు మాతంగి అనిల్, చిట్కూరి అనంతరెడ్డి, ముస్కు ఉపేందర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, అయిలయ్య, చింతల శ్రీధర్ రె డ్డి, తిరుపతిగౌడ్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>