కలం, యాదగిరిగుట్ట: ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో యువకులు, విద్యార్థులు, ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని, వారి త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు.
అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోకుండా, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఆలేరు పట్టణంలోని అండర్‌పాస్ చౌరస్తాకు “తెలంగాణ అమరవీరుల చౌరస్తా”గా నామకరణం చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ ప్రాంతంలో నిర్మించనున్న అమరవీరుల స్థూపం ఆలేరు పట్టణానికి ప్రత్యేక గుర్తింపుగా నిలవడంతో పాటు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణానికి అవసరమైన కట్టడ నిర్మాణ పనులను బీర్ల ఫౌండేషన్ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు.
స్థూపం నిర్మాణాన్ని నాణ్యతతో, ఆకర్షణీయంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. వారి కుటుంబాల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

