కలం, ఇచ్చోడ: విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇచ్చోడ మండల (Ichoda Mandal) కేంద్రంలో రూ.7 కోట్లతో నూతన విద్యాసంస్థల భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. సోమవారం డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ.2 కోట్లు, ZPHS భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించిన నేపథ్యంలో, ఆయా నిర్మాణాల కోసం కేటాయించిన స్థలాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇచ్చోడ మండల కేంద్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. తాను చదువుకున్న పాఠశాలను ఆధునిక వసతులతో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

