కలం, మెదక్ బ్యూరో : వరిసాగులో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వరిని కొనడానికి సిద్ధంగా లేదని.. దీంతో భవిష్యత్ లో వరిసాగు కష్టంగా మారేలా ఉందని చెప్పారు. రైతులు ఇప్పటి నుంచి వాణిజ్య పంటలు పండించాలని, ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని వెల్లడించారు. మార్కెట్ సమస్య, నీటి కొరత, తుఫాన్, కోతుల బెడద, అడవి పందుల సమస్యలు లేని ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభదాయకమని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఆయిల్ పామ్ కి మద్దతు ధర ఇవ్వాలని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సిద్దిపేట (Siddipet) జిల్లా నంగునూర్ (మం) నర్మెట్టలో ప్రారంభానికి సిద్ధమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పామాయిల్ పరిశ్రమ ప్రారంభం కానున్నది. ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి మూడు రోజుల పాటు రైతుమేళా నిర్వహించబోతున్నారు.

