కలం, నిర్మల్ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటించనున్నారని అధికారులు ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కలెక్టర్లతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించి అధికారులకు తగిన సూచనలు చేయనున్నారు. అంతకుముందు నిర్మల్ జిల్లాలో రూ. 23.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఐడీఓసీలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

