కలం, బాసర: పంట దిగుబడిని ఆరబెట్టేందుకు రహదారులను వినియోగించి వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని ముధోల్ సీఐ రవీందర్ నాయక్ (CI Ravinder Naik) రైతులకు సూచించారు. రోడ్లపై సోయా పంటను ఆరబెట్టడం వల్ల ప్రమాదాలపై బాసర మండలం బిద్రెల్లి గ్రామంలో రైతులకు ఆదివారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రహదారులపై సోయా పంటను ఆరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు పంటను గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.
పంటను రోడ్లపై ఆరబెట్టడం వల్ల ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే సంబంధిత రైతుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు తమ పంటను రహదారులకు దూరంగా ఉన్న సురక్షిత ప్రదేశాల్లోనే ఆరబెట్టుకోవాలని సూచించారు.

