కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వెనుకబడిన మక్తల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఎన్నికల్లో గెలిచామన్నది ముఖ్యం కాదని.. ఎన్నుకున్న ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. మక్తల్‌లో ఈనెల 4న ముఖ్యమంత్రి పర్యటనపై శ్రీహరి సమీక్షించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మాగనూరు, కృష్ణ, నర్వ మండలాల నాయకులు, రైతులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. జూన్ 4న మక్తల్ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఏరియల్ సర్వే చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా నదిపై మూడు చోట్ల బ్రిడ్జి కమ్ బ్యారేజ్‌లు, కొల్పూర్ – కొర్తికొండ వద్ద 1.8 టీఎంసీ, మురారి దొడ్డి – గంజిపల్లి, దేవసూగురు వద్ద బ్రిడ్జి కం బ్యారేజ్‌లు, అదేవిధంగా భీమానదిపై రెండు చోట్ల బ్రిడ్జి కమ్ బ్యారేజ్‌లు, సుకుర్ లింగంపల్లి వద్ద ఒకటి, కుసుముర్తి వద్ద మరొకటి బ్రిడ్జి కం బారేజ్‌లకు కూడా ముఖ్య మంత్రి ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ప్రాజెక్టులు
తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో బ్యారేజీలు నిర్మించడం ద్వారా జిల్లాకు సాగు, తాగు నీటి సమస్య తీర్చవచ్చని చెప్పారు. ప్రాజెక్టు పరిధిలో 51 శాతం భూభాగం తెలంగాణకు, 49 శాతం కర్ణాటకకు ఉండటంతో రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా రూపకల్పన చేశామన్నారు. తెలంగాణవాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక సాగునీటి మంత్రి బోసు రాజు, కర్ణాటక రాష్ట్ర ప్రతినిధులతో కలిసి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్ట్‌లపై సమీక్షించనున్నట్టు చెప్పారు. సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
రూ. 5 వేల కోట్లతో మక్తల్– నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం
5 వేల కోట్లతో మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. సీఎం ఏరియల్ సర్వే చేపట్టే చోట బ్రిడ్జ్ కం బ్యారేజీలో పూర్తయి అందుబాటులోకి వస్తే మక్తల్ నియోజకవర్గానికి దాదాపు 8 టీఎంసీల వరకు నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతోపాటు నర్వ మండలంలోని జంగంరెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ప్రభుత్వం రూ .175 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 13 గ్రామాల్లోని సుమారు 7,500 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. చిట్యాల గజరందొడ్డి వాగు వద్ద బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు చేసే సమయంలో ఓ రైతు తన జీవితకాలంలో బ్రిడ్జిని చూస్తానా? అని తనతో అన్నారని అదే రైతుతో బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేయించానని. అతి త్వరలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి అదే రైతు కలను సాకారం చేసి చూపిస్తానని అన్నారు.
కోర్టు ఏర్పాటుతో బాధలు తీరాయి
మక్తల్‌లో గతంలో కోర్టు ఉండేది కాదని సరిహద్దు ప్రాంతాల ప్రజలు 100 కిలోమీటర్లకుపైగా తెల్లవారుజామునే వెళ్లి కేసులకు హాజరయ్యే వారని ఇప్పుడు మక్తల్‌లోనే కోర్టు ఏర్పాటు కావడంతో వారి బాధలు తగ్గాయని చెప్పారు. ప్రస్తుత మక్తల్ కోర్టుకు నారాయణపేట నుంచి లాయర్లు వస్తున్నారని తెలిపారు. గతంలో నారాయణపేటకు ఫోర్‌లైన్ రోడ్డును సాధించుకున్నానని చెప్పారు. అతిత్వరలో పనులు ప్రారంభించి ప్రాంతవాసుల కష్టాలు తొలగిస్తామని భరోసా ఇచ్చారు. సిపురం కల్వాల, గోలపల్లి, మల్లేపల్లి, చినపుర్ల పెద్దపుర్ల, మంథన్ గోడ్ వద్ద బ్రిడ్జిల పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఆత్మకూరు గద్వాల మధ్య కృష్ణా నదిపై కొత్త బ్రిడ్జితో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతున్నట్లు వివరించారు. 18 సంవత్సరాలు అధికారంలో ఉండి బండరాయిని పగలగొట్టలేదని.. కేవలం మూడు నెలల కాలంలో బండరాయిని పగలగొట్టి పరిసర గ్రామాల ప్రజలకు సాగునీరు అందించామని అన్నారు.
గ్రామాలకు బీటీ రోడ్లు
నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాలకు నూతనంగా బీటీ రోడ్లు మంజూరు చేసుకున్నామని, అనేక చోట్ల సీసీ రోడ్లు డ్రైనేజీల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మక్తల్‌ను అభివృద్ధి చేసుకుందామన్నదే తమ లక్ష్యమని వివరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, నాయకులు బాలకృష్ణారెడ్డి, కట్టా సురేష్ గుప్తా, గణేష్ కుమార్, అల్కూరి రవికుమార్, ఆనంద్ గౌడ్, రాజప్ప గౌడ, వార్డు కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్లు, సర్పంచులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

