Mobile Popup Ad
Mobile Popup Ad

ఫ్లెక్సీ వివాదం.. డీఈఓగా సీఎం రేవంత్, కలెక్టర్‌గా మంత్రి ఉత్తమ్

కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారుల (Suryapet Education Department) నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. సమాజానికి ఆదర్శంగా ఉంటూ విద్యార్థులకు మార్గదర్శనం చేయాల్సిన విద్యాశాఖే ఇంతటి ఘోర తప్పిదానికి ఒడిగట్టడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఒక అధికారిక ఫ్లెక్సీ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విద్యాశాఖ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రోటోకాల్‌ను పూర్తిగా గాలికొదిలేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారి పేర్లు, ఫోటోలను ముద్రించడంలో కనీస విచక్షణను కూడా మరిచారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఫోటో వేసి.. కింద ‘జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)’ అని పేర్కొన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఫోటోను ముద్రించి.. ఆయనను ‘జిల్లా కలెక్టర్’గా అభివర్ణించారు.

ఇదీ తెలంగాణ విద్యాశాఖ తీరు!

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రిని డీఈఓగా, కేబినెట్ మంత్రిని జిల్లా కలెక్టర్‌గా మార్చేసి విద్యాశాఖ అధికారులు తమ మేధస్సును చాటుకున్నారు. అంతా అయిపోయాక “అయ్యో.. పొరపాటు జరిగింది” అంటూ నాలుక కరుచుకోవడం అధికారుల వంతయింది. కనీస అవగాహన లేకుండా, క్రాస్ చెక్ చేసుకోకుండా ఇంతటి పెద్ద తప్పిదాన్ని బహిరంగంగా ప్రదర్శించడంపై జిల్లా రాజకీయ, విద్యా వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజలు సైతం అధికారుల బాధ్యతారాహిత్యంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. “డీఈఓ రేవంత్ ఆట.. కలెక్టర్ ఉత్తమ్ ఆట” అంటూ నెటిజన్లు విద్యాశాఖ తీరుపై సెటైర్లు వేస్తున్నారు. ఇంత పెద్ద తప్పు జరుగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>