కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు (Paddy Procurement) ప్రక్రియ సజావుగా జరగడంలేదన్న విపక్షాల విమర్శలు, రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ధాన్య సేకరణపై స్వయంగా ముఖ్యమంత్రి ఇటీవలే సమీక్షించి ఇబ్బందుల్లేకుండా పూర్తికావాలని ఆదేశించారు. అయినా సమస్యలు తలెత్తడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వార పలువురు మంత్రులు, సివిల్ సప్లైస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లతో తాజా పరిస్థితిని సమీక్షించి నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ నెలాఖరుకల్లా ధాన్య సేకరణ ప్రక్రియ పూర్తికావాలని, మరో వారం రోజుల్లో ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ఫీల్డు మీదకు వెళ్ళి ఈ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను స్టడీ చేసి తగిన పరిష్కార మార్గాలను చూడాలన్నారు. మొత్తం 75 లక్షల టన్నుల లక్ష్యంలో ఇప్పటికే 50 లక్షల టన్నుల సేకరణ పూర్తయినట్లు మంత్రి వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 65.91 లక్షల ఎకరాల్లో ఈసారి వరి సాగైందని, సుమారు 141 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ఇందులో కేంద్ర ప్రభుత్వం 52 లక్షల టన్నులను మాత్రమే కొంటామని షరతు పెట్టిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటివరకు మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్లకు వచ్చిన 58.79 లక్షల టన్నుల్లో 50.01 లక్షల టన్నులను కొన్నట్లు వివరించారు. ఇంకా 8.78 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నదని, మూడు రోజుల్లో ఇది కూడా క్లియర్ అవుతుందన్నారు. రానున్న పది రోజుల్లో అదనంగా మరో 16 లక్షల టన్నులు వచ్చే అవకాశమున్నదని, రోజుకు కనీసంగా 3 లక్షల టన్నులను కొనేందుకు వీలుగా ఏర్పాట్లు సిద్ధమైనట్లు వివరించారు. మొత్తంగా కొనుగలు కేంద్రాలకు దాదాపు 75 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. రైతులకు 8,749.82 కోట్లను ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, మిల్లులకు తరలించడానికి వీలుగా 21 కోట్ల గోనె సంచులను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. సరిహద్దు జిల్లాల నుంచి ధాన్యం అక్రమంగా తెలంగాణలోకి రవాణా కాకుండా ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. వరి మాత్రమే కాకుండా జొన్నలు, మొక్కజొన్నలు కూడా రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరి కొనుగోలు సమయంలో తాలు, తరుగు పేరుతో రైస్ మిల్లర్లు, దళారులు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను టాబ్‌లో నమోదు చేసి రైతులకు నగదు చెల్లింపు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

