కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అధికారులకు సూచించారు. శనివారం ఆయన ఖమ్మం 9వ డివిజన్ రోటరీనగర్‌లో 35 లక్షలతో 400 మీటర్ల మేరకు నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం నగరాన్ని కొత్తగా చూసిన వారు చాలా మార్పు వచ్చినట్లు గమనిస్తున్నారని, పారిశుద్ధ్యం చాలా ఇంప్రూవ్ అయిందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు మిగిలి ఉన్న 4 నెలల సమయంలో కార్పోరేటర్లు పూర్తి చేయించుకోవాలని మంత్రి సూచించారు.
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులను చేస్తున్నామని, మనం చేపట్టే పనులు నాలుగు కాలాల పాటు ఉపయోగపడే విధంగా నాణ్యతతో ఉండాలని మంత్రి తుమ్మల
(Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. నగరంలో ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసేందుకు స్థానిక కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలని, నష్టపోతున్న పేదలకు ప్రత్యామ్నాయంగా ఇండ్లు, స్థలాలు ఇస్తామని మంత్రి తెలిపారు.
రోడ్డు విస్తరణతో వ్యాపారం పెరుగుతుంది
టీడీఆర్ విధానం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కూడా అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని అన్నారు. రోడ్డు విస్తరణ వల్ల వ్యాపారాలు పెరుగుతాయని, మన ఆస్తులకు విలువ వస్తుందని అన్నారు. సైడ్ డ్రైయిన్స్ మీద ఫుట్ పాత్ పనులు పూర్తి చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలను ఒప్పించి రోడ్డు విస్తరణ పనులు చేయాలని అన్నారు. నగరంలో చేపట్టిన రోప్ వే, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అన్నారు. లకారం నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని వీటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.


