కలం, మహబూబాబాద్ : కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో(Social Welfare Gurukul School) విద్యార్థులకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు రోడ్డెక్కిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థినుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశాల మేరకు అధికారులు సెలవులు ప్రకటించారు.
ఈ మూడు రోజుల వ్యవధిలో గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలను వెంటనే మెరుగుపర్చాలని ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమస్యలను పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.

