చేనేత వస్త్రాలను ప్రోత్సహిద్దాం.. నేతన్నలకు ఉపాధి పెంచుదాం: మంత్రి పొన్నం

కలం, కరీంనగర్ బ్యూరో: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నేతన్నల ఆరాధ్య దైవమైన మార్కండేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం హుస్నాబాద్ (Husnabad) లో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య​ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో చేనేత వస్త్రాలు ప్రోత్సహిస్తామని, చేనేత వస్త్రాలు ధరిస్తామని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు, వస్త్ర నాగరికతకు మూలస్తంభాలైన.. మార్కండేయ మహర్శి వంశ వారసులైన చేనేత కార్మిక లోకానికి, నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అతిథులకు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పడం మానేసి, నేతన్నలు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలు వాడుతామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. దీని వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు నేతన్నకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

ఇప్పటికే అధికారులకు చేనేత వస్త్రాలు ఉపయోగించాలని ఆదేశాలు జారీచేశామని అన్నారు. గతంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు వారికి అండగా ఉంటూ ఉపాధి అవకాశాలు పెంచుతూ వారి కాళ్ల మీద వారిని నిలబడేలా ఆసరా కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఆర్థికపరమైన అంశాలు బాకీ లేకుండా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హ్యాండ్లూమ్ తో పాటు పవర్ లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.

హుస్నాబాద్ లో విద్య, వైద్యం, టూరిజం, ఇండస్ట్రియల్ కారిడార్ అన్ని రంగాల్లో అభివృధి చేస్తున్నామని అన్నారు. పవర్ లూమ్ క్లస్టర్ పెట్టాలనుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నేతన్నలకు, చనిపోయిన కార్మికులకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. మహిళలకు ఆకుపచ్చ రంగు, ఎరుపు బార్డర్ ఉన్న చీరలు నేతన్నలు నేస్తున్నారని, ప్రభుత్వం మహిళలకు అందిస్తుందన్నారు.

అనంతరం ఇటీవల మరణించిన చేనేత కార్మికుడు అల్వాల రాములు కుటుంబానికి ప్రభుత్వం నుండి రూ. 5 లక్షల చెక్కు మంత్రి పొన్నం అందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కౌన్సిలర్లు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట రమణ, చేనేత సహకార సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>