పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండల కేంద్రం మహాలక్ష్మీ గార్డెన్స్‌లో అర్హులైన లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) నూతన చేయూత పింఛన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 4.68 లక్షల చేయూత పింఛన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. మండలంలో ఇప్పటికే 6,700 పెన్షన్లు ఉండగా.. కొత్తగా మరో 550 పింఛన్లు మంజూరు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏడు రకాల పింఛన్లు మంజూరు చేస్తోందన్నారు. ఈ నెల 19 నుంచి పింఛన్ నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. సరైన ఆధారాలు లేక పింఛన్లు తిరస్కరణకు గురైనవారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లు, తాజాగా మరో 2,000 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, గ్రామాల్లో క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 21న మండలంలో దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత వైద్య, సహాయక ఉపకరణాల శిబిరం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం ఏడు రకాల చేయూత పింఛన్లతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు తిరస్కరణకు గురైనా ఆందోళన చెందవద్దని, MPDO, DRDO, కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, అర్హులకు న్యాయం చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్, సింగిల్ విండో ఛైర్మన్, ఇతర ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>