ప్రభుత్వాలు కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నాయి: రాజ్ గోపాల్ రెడ్డి

‎కలం, చౌటుప్పల్: కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (MLA Komatireddy Raj Gopal Reddy) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‎ప్రభుత్వాలు పనిచేయాల్సింది కాంట్రాక్టర్ల కోసం కాదు.. పేదల కోసం అని చురకలంటించారు. మంగళవారం చౌటుప్పల్ మండలం దామెరలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన ‘చేయూత’ పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

“రోజురోజుకూ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వృద్ధాప్య పెన్షన్ రూ. 4 వేలు కాదు, రూ. 5 వేలు ఇచ్చినా తక్కువే.. పెన్షన్ పెంచుతామని మాట తప్పారంటూ ప్రజలు మమ్మల్ని ఊర్లలో నిలదీస్తున్నారు. పెన్షన్ పెంపు విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఈ విషయంలో లబ్ధిదారులతో పాటు నేను కూడా మీ తరపున కొట్లాడుతాను” అని రాజ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత పదేళ్లుగా కొత్త పింఛన్లు రాక వేలాది మంది తల్లులు వేయి కళ్లతో ఎదురుచూశారని, కేవలం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మాత్రమే కొన్ని పింఛన్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత నేడు పేదలకు ఈ శుభదినం వచ్చిందన్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు పింఛన్లు ఇవ్వడం చాలా మంచి నిర్ణయమని కొనియాడుతూనే, వీరితో పాటు వృద్ధులకు కూడా పింఛన్లు ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

వృద్ధాప్య పింఛన్ల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, రాబోయే కాలంలో తప్పకుండా ఇప్పిస్తానని రాజ్​ గోపాల్​ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉన్నది పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, ధనవంతుల కోసం కాదని, కేవలం పేదల కోసం మాత్రమే పనిచేయాలని రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని సంక్షేమ పథకాల రూపంలో అర్హులైన ప్రతి పేదవాడికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

మన బతుకులు బాగుపడతాయనే ఆశతో, ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కానీ అనుకున్న స్థాయిలో పేదవాళ్లకు ఇంకా న్యాయం జరగలేదన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని ఆయన (Raj Gopal Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ‎

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ సీఈవో శోభారాణి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్, నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల ఎంపీడీవోలు, ఇతర అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, చౌటుప్పల్ మున్సిపాలిటీ, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>