కలం, సిరికొండ: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పూర్తి పారదర్శకతతో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని సిరికొండ (Sirikonda) మండల కేంద్రంలో మంగళవారం రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించాలనే ఉద్దేశంతో గ్రామస్థాయిలో ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించి, అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో జిల్లావ్యాప్తంగా సుమారు 14,500 కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని, ఒక్క సిరికొండ మండలంలోనే 4,500 పింఛన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు నవంబర్ 19 నుంచి నాలుగు వారాలపాటు విడతలవారీగా గ్రామాల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబ యజమాని వివరాలు, నామినీ వివరాలను నమోదు చేసి, దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీఆర్డీఏ అధికారి రవీందర్ రాథోడ్, తహశీల్దార్ అరవింద్, ఎంపీడీవో సంతోష్, స్థానిక సర్పంచ్ దత్తు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.

