ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత శక్తివంతమైన ఆయుధం: మంత్రి పొన్నం

కలం, కరీంనగర్ బ్యూరో: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం (Vemulawada Rajarajeshwara Temple) లోని భీమేశ్వరాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ (Adi Srinivas) తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తకొండ వీరభద్రస్వామి నక్షత్రమాల వేసుకున్న సందర్భంగా నేడు వేములవాడను సందర్శించినట్లు తెలిపారు. కాకతీయుల కాలం నాటి గొప్ప చరిత్ర, ఆధ్యాత్మికత కలిగిన ఈ పుణ్యక్షేత్రాలను ప్రతి ఒక్కూ దర్శించుకోవాలని అన్నారు.

మన ఇష్టదైవమైన రాజన్న ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించానన్నారు. ఇటీవల కొండగట్టు పాదయాత్రతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మేము వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐక్యతతో, నిరంతర సుఖసంతోషాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే మా కాంక్ష అని తెలిపారు.

‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు కాపాడుకోవాలి’

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం కొనసాగుతోందని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన హక్కు అని అన్నారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నచిన్న స్పెల్లింగ్ తప్పులు, పేర్లు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉన్నా, ఓటర్లకు నోటీసులు అందినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులను సంప్రదించి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించి తమ ఓటును సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బూత్ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా, ఇప్పటికే ఉన్న ఓట్లలో తప్పులు ఉంటే సరిచేసుకునేలా ప్రజలకు సహకరించాలని పేర్కొన్నారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఓటర్ల పునర్విమర్శ ప్రక్రియపై రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమయ్యాయని అన్నారు. తెలంగాణలో మాత్రం అర్హత ఉన్న ప్రతి పౌరుడి ఓటు హక్కు కాపాడబడేలా ఓటర్ల సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని సూచించారు.

ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లకు, వివాదాలకు తావులేకుండా సజావుగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల సవరణలో మీ పేరు, వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించుకోవాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఓ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శలు ఉన్నాయని, పలు రాష్ట్రాల్లో జరిగిన ఓటరు సవరణ ప్రక్రియ తరువాత జరిగిన ఎన్నికల ఫలితాలు చూశామని అన్నారు.

‘ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’

ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు అని, ఆ హక్కును ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>