‘యంగ్ ఇండియా’ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంపై మంత్రి ఆదేశాలు

కలం, ఖమ్మం బ్యూరో : పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ (Ponnekal) గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను వచ్చే జూన్ కల్లా పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) అధికారులను ఆదేశించారు. ఆదివారం పొన్నెకల్ లో నిర్మాణంలో ఉన్న పాఠశాల సముదాయం పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి మంత్రి క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించారు. భవన సముదాయాలు, కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణాలను పరిశీలించిన ఆయన, పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పనుల్లో ఎక్కడా ఆలస్యం, అలసత్వం వహించడానికి వీల్లేదని గుత్తేదారులు, అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం నాలుగు అకడమిక్ బ్లాకుల్లో ఒక బ్లాక్ స్లాబ్ స్థాయికి రాగా, రెండు బ్లాకులు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని, ఒక బ్లాక్ పనులు ఇంకా ప్రారంభం కావలసి ఉందని తెలిపారు. అదేవిధంగా తొమ్మిది సీనియర్ హాస్టళ్లలో ఒక హాస్టల్ జీ ప్లస్ 1 స్లాబ్ పూర్తవగా, ఐదు హాస్టళ్ల నిర్మాణాలు బేస్ మెంట్ స్థాయికి చేరుకున్నాయని, మరో మూడు హాస్టళ్ల పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని వివరించారు. కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణాలు వేగంగా పురోగతిలో ఉన్నాయన్నారు. పనులను మరింత వేగవంతం చేసేందుకు వెంటనే నిర్మాణ కార్మికుల సంఖ్యను పెంచాలని, నిర్ణీత గడువులోగా స్కూల్ ను అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారులను ఆదేశించారు.

​విద్య ద్వారానే సమాజంలో గొప్ప గుర్తింపు, గౌరవం దక్కుతాయని, అందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి (Minister Ponguleti) పేర్కొన్నారు. రాష్ట్రంలోని బిడ్డలు అక్షరమే ఆయుధంగా మలుచుకొని చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కుల, మత, వర్గ, ప్రాంత, ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా అందరి పిల్లలూ ఒకేచోట కలిసి చదువుకోవాలనే మహోన్నత లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందన్నారు. పిల్లలందరూ ఒకే చోట చదువుకోవడం వల్ల వారిలో ‘వసుదైక కుటుంబ’ భావన ఏర్పడుతుందని, చదువుతోనే అంతరాలు లేని సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. ​ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, ఆర్ అండ్ డబ్ల్యూ ఈఈ యుగంధర్ రావుతో పాటు పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : గోవా బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>