ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ హంగులు: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్ది, పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి ఆశ్రమ పాఠశాలల రూపురేఖలను మార్చుతామని మంత్రి స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన మంత్రి, ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం (Edulapuram) మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం (Gollagudem) ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.4.85 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. విద్యను కేవలం సంక్షేమ కార్యక్రమంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే పెట్టుబడిగా భావించి విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని పిల్లలను ఆశ్రమ పాఠశాలలకు పంపిస్తున్నారని, విద్యార్థినులు వారి త్యాగాలను గుర్తించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మంత్రి సూచించారు.

విద్య మాత్రమే జీవితాలను మార్చగల శక్తి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలను అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వాతావరణం, ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>