కలం, వెబ్ డెస్క్ : అమరావతి (Amaravati) లో అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగిన అనంతరం మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమం రాత్రి ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు.
అమరజీవి స్మారకార్థం నిర్మించిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తి చేసినందుకు ట్రస్ట్ సభ్యులను మంత్రి లోకేశ్ అభినందించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం చిరస్మరణీయమని లోకేశ్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజానికి సేవ చేయడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సమాజానికి ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.

