కాలుష్య కోరల్లో మంజీరా.. ఆందోళనలో అన్నదాతలు, మత్స్యకారులు!

క‌లం, మెద‌క్ బ్యూరో : హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగునీటిని అందించే మంజీరా నది (Manjeera River Pollution) కాలుష్య కోరల్లో చిక్కుకున్నది. నదిలో తెల్లటి నురుగులు కొండల్లా పేరుకుపోయి కనిపిస్తుండటం కాలుష్య తీవ్రతకు అద్దం పడుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, పాశమైలారం పారిశ్రామికవాడల వ్యర్థ జలాలు నక్కవాగు ద్వారా మంజీరా నదిలో కలుస్తున్నాయి. స్థానిక ప్రజల జీవనంతో పాటు పర్యావరణానికీ తీవ్ర ముప్పు ఏర్పడుతున్నది. నదిలోకి చేరే రసాయన వ్యర్థ జలాల నియంత్రణపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), సంబంధిత అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నక్కవాగు నుంచి మంజీరాలోకి..

మంజీరా నదికి నక్కవాగు ఉపనది. పటాన్‌చెరు ప్రాంతంలో ప్రారంభమయ్యే నక్క వాగు సంగారెడ్డి మండలం గౌడిచెర్ల వద్ద మంజీరాలో కలుస్తున్నది. పటాన్‌చెరు, పాశమైలారం పారిశ్రామిక వాడల్లోని ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమల వ్యర్థ జలాలు ముందుగా నక్కవాగులోకి చేరుతున్నాయి. బల్క్ డ్రగ్ పరిశ్రమలు పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండానే వ్యర్థ రసాయన జలాలను వదులుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పటాన్‌చెరు పరిధిలోని పట్టణాలు, గ్రామాల మురుగునీరు కూడా నక్కవాగులోనే కలుస్తున్నది. తద్వారా కాలుష్యం వాగుకే పరిమితం కాలేదు. పరివాహక ప్రాంతాలు, వ్యవసాయ భూములు, భూగర్భ జలాలు, స్థానిక ప్రజల జీవనంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. సంగారెడ్డి శివారులోని చెరకు, బీరు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను సరైన విధంగా శుద్ధి చేయకుండానే వదులుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కాలుష్య జలాలు నక్కవాగు ద్వారా ఇస్మాయిల్‌ఖాన్‌పేట పరిసరాల మీదుగా ప్రవహించి గౌడిచెర్ల, కోర్పోలు ప్రాంతాల వద్ద మంజీరాలో కలుస్తున్నాయి. దీంతో ప్రధాన నది కలుషితంగా మారుతున్నది.

కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు

మంజీరా నది పరిసరాల్లో సుమారు అర కిలోమీటరు మేర తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తున్నది. చౌటకూరు మండలం వెండికోలు, లింగంపల్లి, కోర్పోలు తదితర గ్రామాల ప్రజలు, రైతులు కాలుష్య జలాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దుర్వాసనతో నిండిపోతున్నాయి. రైతులు ముక్కు మూసుకుని పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. నదిలోని చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. గతంలోనూ మంజీరాలోకి కాలుష్య జలాల కారణంగా క్వింటాళ్ల కొద్దీ చేపలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. పారిశ్రామిక వ్యర్థ జలాలతోనే ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసిద్ధ ఏడుపాయల ఆలయ పరిసర ప్రాంతాలకు కూడా మంజీరా నది కీలక జలవనరుగా ఉండటంతో భక్తుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నది.

నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతున్నది. మంజీరా నదిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న పరివాహక గ్రామాల రైతులు కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. నదిలోని కలుషిత జలాలు సమీపంలోని చెరువులు, భూగర్భ జలాల్లోకి చేరే ప్రమాదం ఉండటంతో పంటల దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత కూడా దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుపోషణపై ఆధారపడిన కుటుంబాలు కూడా ఆర్థికంగా నష్టపోతున్నాయి. మంజీరా నది కలుషితమవుతుండటంతో ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

మంచు కొండలను తలపించేలా నురుగు చౌటకూరు మండలం సరాఫ్‌పల్లి శివారు, చౌటకూరు ప్రాంతాల్లో మంజీరా నది తెల్లటి విషపూరిత నురుగులతో నిండిపోయినది. నది పరిసరాల్లో మంచు కొండలను తలపించేలా తెల్లటి నురుగులు గుట్టలుగా పేరుకుపోయాయి. నదిపై నురుగులు కాలుష్య తీవ్రతను స్పష్టం చేస్తున్నది. కలుషిత జలాలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పీసీబీ నిర్లక్ష్యంపై విమర్శలు

మంజీరా నది కాలుష్యాన్ని అరికట్టి, బాధ్యులైన పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ, జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. వ్యర్థ జలాలను నేరుగా నదిలోకి వదులుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. నక్కవాగు, మంజీరా కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంజీరా మరో మూసీ నదిలా మారకముందే పారిశ్రామిక వ్యర్థ జలాల విడుదలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, నది పరిరక్షణకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>