కలం, ఖమ్మం బ్యూరో: మద్యం మత్తులో నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్త ఆగడాలను తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిన భార్యపై, భర్త శుక్రవారం కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. రోజువారీ కూలీ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ఆమెను వెంబడించి బ్లేడుతో గొంతుపై దాడి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలంలో తీవ్ర కలకలం రేపింది.
మణుగూరు మండలం అన్నారం ప్రాంతానికి చెందిన సాధనపల్లి రత్నకుమారి (30) తన భర్త మద్యం తాగి రోజూ పెడుతున్న వేధింపులు భరించలేక, అతనికి దూరంగా పుట్టింట్లో ఉంటోంది. రోజువారీ కూలీ పనుల కోసం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో, భర్త ఆమెను వెంబడించి ఒక్కసారిగా బ్లేడుతో గొంతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రత్నకుమారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఎమర్జెన్సీ విభాగానికి వచ్చిన బాధితురాలిని ఆసుపత్రి ఈఎన్టీ వైద్యులు పరీక్షించారు. ఆమె మెడపై మూడు గాయాలు ఉన్నాయని, వాటిలో రెండు చిన్నవి కాగా ఒకటి కొంచెం పెద్దదిగా ఉందని వైద్యులు వెల్లడించారు. తక్షణమే రక్తస్రావాన్ని నియంత్రించి గాయాలకు కుట్లు వేశామని, బాధితురాలికి ఎటువంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.
మణుగూరు (Manuguru) బీటీపీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన రత్నకుమారి ఆరోగ్య పరిస్థితిపై ఎస్ఐ రహూఫ్ ఆసుపత్రికి చేరుకుని ఆరా తీశారు. బాధితురాలికి అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్న అనంతరం, జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యుల ద్వారా సేకరించారు. కాగా మహిళపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

