ఎండుతున్న మంజీరా.. నీటి సరఫరాపై అధికారుల ఆందోళన

కలం, మెదక్‌ బ్యూరో: ఉమ్మడి మెదక్‌ జిల్లాకు ప్రాణాధారమైన మంజీరా నది(Manjeera River) ఎండిపోతోంది. సింగూరు ప్రాజెక్టులోనూ నీటి నిల్వలు అడుగంటడంతో తాగునీటి సరఫరాపై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఉన్న నీటితో డిసెంబరు వరకు మాత్రమే అవసరాలు తీర్చగలమని, అదీ రోజు విడిచి రోజు సరఫరా చేస్తేనే సాధ్యమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత సింగూరు, మంజీరా బ్యారేజీలు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భూగర్భ జలాలూ వేగంగా పడిపోతుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రిపేర్ల కోసం సింగూరు ఖాళీ

సింగూరు ప్రాజెక్టు సంగారెడ్డిలోని పుల్కల్ మండలంలో ఉంది. దీని భద్రతపై డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌ నివేదిక అందిన నేపథ్యంలో, దాని సూచనల మేరకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.16 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయం తీసుకునే సమయానికి ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరమ్మతుల కోసం గత డిసెంబరులో తాగునీటి అవసరాల కోసం కొంత నీటిని నిల్వ ఉంచి, ప్రాజెక్టును ఖాళీ చేశారు. అప్పటినుంచి సింగూరు కింద సాగయ్యే 40 వేల ఎకరాలతో పాటు ఘనపురం ప్రాజెక్టు కింద సాగయ్యే 20 వేల ఎకరాల్లోనూ క్రాప్‌ హాలిడే కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.7 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

మంజీరా క్యాచ్‌మెంట్‌లో వర్షాభావం

ఎల్‌‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గింది. సంగారెడ్డి జిల్లాలో 13 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మెదక్‌ జిల్లాలో సాధారణం కంటే కొంత ఎక్కువ వర్షం కురిసినా, మంజీరా క్యాచ్‌మెంట్‌ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ మంజీరా పరీవాహక ప్రాంతంలో చెప్పుకోదగ్గ వర్షపాతం లేకపోవడంతో నదిలోకి వరద చేరలేదు. ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టులోకి వచ్చిన ఇన్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కుల లోపే ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

అడుగంటిన సింగూరు, మంజీరా
  • 29.91 టీఎంసీల సామర్థ్యమున్న సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 2.7 టీఎంసీల నీరే ఉంది. ఇందులో ఒక టీఎంసీ డెడ్‌ స్టోరేజీ. మిగిలిన 1.7 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. అయితే.. డెడ్‌ స్టోరేజీ నీటిని కూడా తీసుకునేందుకు జలమండలి ఇటీవల ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 14 కొత్త మోటార్లు బిగించి, చివరి నీటి బొట్టు వరకు తోడుకునేలా పైప్‌లైన్లు ఏర్పాటు చేసింది. ట్రయల్‌ రన్‌ పూర్తిచేసిన అనంతరం ఇటీవలే మోటార్లను ప్రారంభించింది.
  • మంజీరా డ్యాం సంగారెడ్డికి సమీపంలోని కల్పగూరు గ్రామంలో ఉంది. దీని కెపాసిటీ 1.5 టీఎంసీలు మాత్రమే. నదిలో నీరు లేకపోవడంతో డ్యాం దాదాపు ఎండిపోయింది. మొన్నటివరకు ఇందులో కేవలం 0.15 టీఎంసీలు మాత్రమే నీరుంది. శనివారం అధికారులు సింగూరు నుంచి 0.15 టీఎంసీలను మంజీరాకు విడుదల చేయడంతో 0.3 టీఎంసీలకు పెరిగింది.
డిసెంబరు వరకే..

సింగూరు, మంజీరా బ్యారేజీలు హైదరాబాద్‌లోని కొంత ప్రాంతంతో పాటు ఉమ్మడి మెదక్‌, కామారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. హైదరాబాద్‌కు రోజూ 115 నుంచి 120 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. మిషన్‌ భగీరథ అవసరాల కోసం సింగూరు నుంచి 15.08 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. మంజీరా నదిపై ఆధారపడి పదుల సంఖ్యలో తాగునీటి ప్రాజెక్ట్‌లు కొనసాగుతున్నాయి. నదిలో నీటి లభ్యత తగ్గడంతో వీటి నిర్వహణ కష్టంగా మారింది. 1,758 గ్రామాలు, 11 మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరాపై ఆందోళన నెలకొంది. ప్రస్తుత నిల్వలతో డిసెంబరు వరకు ఎలాగోలా నెట్టుకురావచ్చని, అదీ రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తేనే సాధ్యమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా బోర్లు వేసి నీటిని సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు ఫలిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

విద్యాసంస్థలకూ నీటి కోత

నీటి లభ్యత తగ్గడంతో సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, బీహెచ్‌ఈఎల్‌ వంటి సంస్థలకూ నీటి కష్టాలు మొదలయ్యాయి. వీటికి రోజూ సరఫరా చేసే నీటిలో దాదాపు 50 శాతం కోత విధించినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశముంది. అదే జరిగితే ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు, విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంజీరా నదిపై ఆధారపడిన పలు తాగునీటి పథకాల ఇన్‌టేక్‌ వెల్స్‌ వద్ద నీరు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాల్లో ఇప్పటికే రెండు మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. నారాయణఖేడ్‌ పరిసర తండాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే డిసెంబరు తర్వాత నీటి అవసరాలు ఎలా తీరుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>