కలం, వెబ్‌డెస్క్: దేశంలో అవకాశవాద రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు కొత్త ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ (Manish Tewari) లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని సమర్పించారు. ప్రస్తుతం అమలులో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా సిద్ధాంతాలు లేదా విధానాల్లో ఎలాంటి నిజమైన విభేదాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జరిగే సామూహిక పార్టీ ఫిరాయింపులను కఠినంగా నిరోధించేలా కొత్త చట్టం రూపొందించాలన్నారు. అదే సమయంలో పార్లమెంట్‌తో పాటు రాష్ట్ర శాసనసభల్లో ప్రజాప్రతినిదులు నిజాయితీతో, నిర్మాణాత్మకంగా తమ విభేదాలను వ్యక్తం చేసే స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం కలగకుండా చట్టాన్ని రూపొందించాలని మనీష్ తివారీ తన వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో చర్చ జరపాలని ఆయన కోరారు.

