కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (Jubilee Hills SHO) ఇన్ స్పెక్టర్ యు. శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక వివాహిత మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని లైంగికంగా వేధించడం, బెదిరింపులకు గురిచేయడం, డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అధికారులను ప్రాథమికంగా వేకెన్సీ రిజర్వ్ (VR)కు పంపడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, ఈ కేసులోని తీవ్రతను పరిగణనలోకి తీసుకుని శ్రీనివాసులు రెడ్డిని నేరుగా సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దర్యాప్తు వివరాల ప్రకారం, బాధిత మహిళ గతంలో (2021 డిసెంబర్లో) తన కుటుంబ సమస్యల పరిష్కారం కోసం అప్పటి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్న శ్రీనివాసులు రెడ్డిని ఆశ్రయించారు. ఆ సమయంలో ఆమె సమస్యను పరిష్కరించిన సీఐ, ఆ తర్వాత ఆమెతో నిరంతరం ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా పరిచయాన్ని కొనసాగించారు. ఆ పరిచయంతో క్రమంగా ఆమెను లొంగదీసుకుని, వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఆ తర్వాత సదరు మహిళకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను అడ్డుపెట్టుకుని ఆమెను భయభ్రాంతులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలను బయటపెడితే ఆమె సొంత ఊరిలో పరువు తీస్తానని బెదిరిస్తూ, పలు దఫాలుగా ఆన్లైన్ పేమెంట్ల రూపంలో భారీగా డబ్బు వసూలు చేసినట్లు సదరు బాధిత మహిళ ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వేధింపులు భరించలేకపోయిన బాధిత మహిళ ఇటీవల నేరుగా తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) సి.వి. ఆనంద్‌ను కలిసి పూర్తి స్థాయి ఆధారాలతో సహా ఫిర్యాదు సమర్పించారు. దీనిపై తక్షణమే స్పందించిన డీజీపీ, ఈ వ్యవహారంపై సమగ్ర అంతర్గత విచారణ జరపాల్సిందిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.
పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక అంతర్గత విచారణ కమిటీ ప్రాథమిక దర్యాప్తు చేపట్టి, బాధిత మహిళ సమర్పించిన డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ లావాదేవీల రికార్డులను పరిశీలించింది. ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, సదరు మహిళను వేధించినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైన ఆధారాలు లభించడంతో, కమిటీ నివేదిక ఆధారంగా కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సంచలన కేసుపై పోలీసు ఉన్నతాధికారులు మరింత లోతైన విచారణను కొనసాగిస్తున్నారు.

