లైవ్ మ్యూజిక్ పేరుతో అశ్లీల నృత్యాలు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: లైవ్ మ్యూజిక్, ఆర్కెస్ట్రా లైసెన్సుల ముసుగులో అక్రమంగా నడుస్తున్న డ్యాన్స్ బార్లకు అడ్డుకట్ట వేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) కీలక నిర్ణయం తీసుకుంది. చట్టంలోని లొసుగులను వాడుకుంటూ సాగుతున్న ఈ అక్రమ వ్యాపారాలను అణచివేసేందుకు వీలుగా రూపొందించిన సవరణ బిల్లును మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2005లో అప్పటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం డ్యాన్స్ బార్లపై పూర్తి నిషేధం విధించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు, చట్టపరమైన చిక్కుల నేపథ్యంలో 2016లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. అయినా ఆర్కెస్ట్రా పేరుతో డ్యాన్స్ బార్లు నడుపుతున్నారనే ఫిర్యాదులు రావడంతో, ప్రభుత్వం తాజాగా చట్టాన్ని సవరించింది.

ఈ కొత్త బిల్లును గ్రామీణ హోంశాఖ సహాయ మంత్రి పంకజ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2016 నాటి చట్టం తర్వాత డ్యాన్స్ బార్ల సంఖ్య తగ్గినప్పటికీ.. మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ కింద ఇచ్చే ఆర్కెస్ట్రా, లైవ్ మ్యూజిక్ లైసెన్సులను దుర్వినియోగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాత నిబంధనల ప్రకారం ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు అధికారాలు లేవని, అందుకే ఈ సవరణలు అవసరమయ్యాయని వివరించారు. ఇకపై లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలను కూడా 2016 నాటి అశ్లీల నృత్యాల నిషేధ చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది.

ఈ నూతన సవరణల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన శిక్షలు పడనున్నాయి. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ. 25 లక్షల వరకు జరిమానాతోపాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా అవకాశాలున్నాయి. గతంలో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం డ్యాన్స్ బార్లు విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటరు దూరంలో ఉండాలి. నివాస ప్రాంతాల్లో ఉండకూడదు. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు మాత్రమే నడపాలి అనే నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్కెస్ట్రాలకు కూడా ఇవే నిబంధనలు వర్తించనుండటంతో అక్రమ డ్యాన్స్ బార్లకు పూర్తిగా చెక్ పడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>