విద్యార్థులపై లాఠీచార్జి ప్రజాస్వామ్య హత్యే: ఏఐఎస్ఎఫ్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పార్లమెంట్ సమీపంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం జరిపిన లాఠీచార్జిని ఏఐఎస్ఎఫ్ మహబూబ్‌నగర్ జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ (Mahabubnagar AISF) రాష్ట్ర సహాయ కార్యదర్శి సి .రాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసన తెలిపినా, వారి గొంతును లాఠీలతో అణచివేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

ప్రశ్నించే ప్రతి గొంతును బలప్రయోగంతో అణచివేయాలనే ధోరణిని దేశ ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాటిని వినకుండా పోలీసులతో దాడులు చేయించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఈ ఘటనకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.

విద్యార్థులపై లాఠీచార్జికి ఆదేశాలు ఇచ్చిన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రాజు డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులను శత్రువులుగా చూడడం మానుకోవాలని, వారి సమస్యలను అణచివేతతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. విద్యార్థులపై దాడులు కొనసాగితే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా, అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, లక్ష్మణ్, నాయకులు ధర్మేంద్ర, శేఖర్, వేణు, వెంకట్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>