కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) శుక్రవారం పరిశీలించారు. బూత్ స్థాయిలో జరుగుతున్న ఓటర్ల నమోదు, సవరణ, మార్పులు, చేర్పుల ప్రక్రియను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. అలాగే అర్హులైన వారు తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడంతో పాటు, వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సకాలంలో సవరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

