క్షమించు గణపయ్యా.. నిమజ్జనానికి నీటి కష్టాలు!

కలం, జోగులాంబ గద్వాల: వినాయక చవితి‌ సందర్భంగా భక్తులతో విశేష పూజలందుకునే గణనాథుడు గంగమ్మ ఒడిలో నిమజ్జనం అవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఇప్పటివరకు రైతులపై ప్రభావం చూపుతున్న ఎల్ నినో దేవుళ్ల మీద కూడా చూపిస్తోంది. జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో కృష్ణా నదికి గత నెల రోజులుగా వస్తున్న వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. దీంతో జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో కుడి, ఎడమ కాలువలకు సాగు నీటిని నిలిపేశారు.

భారీ విగ్రహాల నిమజ్జనం ఎలా..?

గద్వాల పట్టణ పరిధిలో నది అగ్రహారం పుష్కరఘాట్, బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద నీళ్లు అడుగంటిపోయాయి. మడుగుల వద్దనే కొంత నీటి నిల్వలు కనిపిస్తుండగా.. అక్కడే గణనాథులను నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మూడు రోజుల తొలి పూజల అనంతరం నిమజ్జనానికి తరలించిన గణనాథుల ప్రతిమలు నీళ్లు లేక నదీ గర్భంలో అరకొర నీటిలోనే తేలియాడుతున్నాయి. రాబోయే రోజుల్లో భారీ విగ్రహాల నిమజ్జనం ఎలా జరపాలనే దానిపై భక్తులు, ఉత్సవ నిర్వాహకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరికొందరు నీటి కొరత వలన విగ్రహాలను నీటి లేని కాలువల్లోనే వదిలేస్తున్నారు.

అడుగంటిన తుంగభద్ర..

గద్వాల జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉండగా.. వీటి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎన్నో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు తుంగభద్ర, కృష్ణా నదులకే తీసుకొస్తుంటారు. ఏటా బీచుపల్లి వద్ద వేలాది సంఖ్యలో భక్తులు ఇలా విగ్రహాలతో తరలి వస్తుంటారు. ఎల్‌నినో కారణంగా వర్షాలు లేకపోవడంతో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కృష్ణా బేసిన్‌లో అరకొర వర్షాలతో వస్తున్న వరదతో కృష్ణా నదిలో కొంత నీరు ఉండగా.. తుంగభద్ర మాత్రం పూర్తిగా ఒట్టిపోయింది. వినాయక విగ్రహాలు నీటిలో మునిగే స్థాయిలో కూడా నీరు లేదు. దీంతో చేసేదేమీ లేక బీచుపల్లి వద్దే పెద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>