కలం, జోగులాంబ గద్వాల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki Venkataiah) ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించే నిధులను సద్వినియోగం చేసుకునేలా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు అంశాలపై ఛైర్మన్ బక్కి వెంకటయ్య సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, సంతు సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రూ.2 వేల కోట్లు నిధులు..
ఈ సందర్భంగా ఛైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.2 వేల కోట్ల నిధులను బడ్జెట్లో కేటాయించిందన్నారు. వీటితో సీసీ రహదారులు, డ్రైనేజీలు, తదితర మౌలిక వసతులు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయిస్తామన్నారు. గద్వాల జిల్లాలో కులాంతర వివాహాలు చేసుకున్న వారు, విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకునేవారికి ఎప్పటికప్పుడు నిధులు సమకూరేలా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానన్నారు. దళితులు, గిరిజనుల భూ సమస్యల పరిష్కారంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని రెవెన్యూ అధికారులను కోరారు. ప్రతి నెలా అన్ని మండలాల్లో పౌర హక్కుల దినం నిర్వహించాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.
బాధితులకు పరిహారం..
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించే నిధులను వంద శాతం ఖర్చు పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి నెలా అన్ని మండలాల్లో సివిల్ రైట్స్ డే కూడా తప్పకుండా నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. ఏడాది కాలంగా 53 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, బాధితులకు పరిహారం చెల్లించడంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.
డీఎస్పీ స్థాయి అధికారితో..
ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించేందుకు డీఎస్పీ స్థాయి అధికారులతో విచారణ చేయీస్తున్నామని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి అవసరమైన కుల ధ్రువ పత్రాలు ఇవ్వడమే కాక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా సహకరిస్తున్నారన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పర్యవేక్షణలో కూడా తరచూ జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రేపల్లె బాధితులకు చెక్కు..
రేపల్లె ఘటనపై బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయడమే కాక దాడికి పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పలు దళిత సంఘాల నేతలు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు. బాధ్యులపై కేసు నమోదు చేసినందున పరిహారంలో మొదటి విడతగా వచ్చిన రూ.25 వేల చెక్కును కమిషన్ ఛైర్మన్, కలెక్టర్, తదితరులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వివిధ సంఘాల నేతలు ఛైర్మన్, సభ్యులను సన్మానించి వినతి పత్రాలు అందజేశారు. అంతకుముందు కమిషన్ రేపల్లె గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, ఎన్జీవో ఆర్గనైజేషన్ మెంబర్ గంధం నాగరాజు, అదనపు కలెక్టర్లు మధుమోహన్ నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కురుమన్న, శైలజ, మల్లికార్జున్, సురేష్ నాయక్, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నాగరాజు, కార్పొరేషన్ ఈవో సుదర్శన్, ఎస్టి అభివృద్ధి అధికారి యాదమ్మ పాల్గొన్నారు.

