కలం, కరీంనగర్ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ‘పోలీస్ రాజ్యం’ నడుపుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆరోపించారు. కరీంనగర్‌లో (Karimnagar) నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా అభివృద్ధిని పక్కనపెట్టి, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.
చేనేత, గల్ఫ్ కార్మికులకు ద్రోహం
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు, 40 శాతం సబ్సిడీలతో సిరిసిల్ల నేతన్నలను ఆదుకున్నామని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకుండా, బకాయిలు చెల్లించకుండా నేతన్నలను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా గల్ఫ్ కార్మికులను కూడా మోసం చేసిందని విమర్శించారు.
దళిత బంధు నిలిపివేత
దళితుల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ తీసుకొచ్చిన ‘దళిత బంధు’ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.12 లక్షల ‘అంబేద్కర్ అభయ హస్తం’ పథకం ఏమైందో దళిత నాయకులు ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని కోరారు.
సిరిసిల్ల అభివృద్ధిపై దాడి
సిరిసిల్లలో బీఆర్‌ఎస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం, బ్రిటిష్ కాలం నాటి పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సిరిసిల్ల ప్రజలు వరుసగా ఆరు సార్లు గెలిపించిన కేటీఆర్‌ను ‘వలసవాది’గా పేర్కొనడం ప్రజల తీర్పును అవమానించడమేనన్నారు. హైడ్రా, ప్రాజెక్టుల రీ-డిజైన్ల పేరుతో జరిగిన ఖర్చులు, వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను నెరవేర్చలేకే రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలని కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.

