చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ నీళ్లు.. కాంగ్రెస్ వైఫల్యాలపై కొప్పుల విమర్శలు..

కలం, కరీంనగర్ బ్యూరో : కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ‘గురుదక్షిణ’గా ధారాదత్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు, కళ్లు మూసుకుని చోద్యం చూస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

​నీళ్ల లెక్కలు అడిగితే సీఎంకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు?

తెలంగాణకు జరుగుతున్న నీటి అన్యాయంపై హరీశ్ రావు లెక్కలు అడుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌తో వ్యవహరిస్తున్నారని కొప్పుల విమర్శించారు. 2025లో 299:512 నిష్పత్తి తాత్కాలిక ఒప్పందానికి ఎందుకు అంగీకరించారని, నల్లగొండ, పాలమూరు జిల్లాలకు నష్టం చేసే జీవో 453పై ఆ ప్రాంత మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.

ఏపీలో హంద్రీ-నీవా పనుల కోసం చంద్రబాబు 403, 405 జీవోలు ఇస్తే ఎందుకు అడ్డుకోలేదని, ప్యాకేజీ-3 మిగిలిన 25 శాతం పనులు పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు వచ్చి పాలమూరు సస్యశ్యామలమయ్యేదని గుర్తు చేశారు. ‘పల్నాడు స్కీమ్’ జీవో 56లో నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామనే ప్రతిపాదన ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఆంధ్రా ప్రాంత అధికారులను కీలక స్థానాల్లో నియమించుకుని నీళ్ల దోపిడీకి పాల్పడుతున్నారని, కాంగ్రెస్ అసమర్థత వల్లే రాష్ట్రంలో ‘కృత్రిమ కరువు’ ఏర్పడిందని ఆరోపించారు.

​ధర్మపురి అభివృద్ధిపై బహిరంగ సవాల్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సొంత నియోజకవర్గ సమస్యలను గాలికొదిలేసి, స్థాయికి మించి హరీశ్ రావుపై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని కొప్పుల మండిపడ్డారు. “20 ఏళ్లు ఎమ్మెల్యేగా, 10 ఏళ్లు అధికారంలో ఉన్న మా హయాంలో ధర్మపురి నియోజకవర్గంలో ఒక్క ఎకరం పంట అయినా ఎండినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరేం చేస్తారు?” అని సవాల్ విసిరారు.

​పంటలు ఎండుతున్నా పట్టించుకునే సోయి లేదు

ప్రస్తుత ప్రభుత్వ నిర్వాహక లోపం వల్ల ధర్మపురి మండలంలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 14 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద కాలిపోయిన మోటార్లకు ఏడాదైనా మరమ్మతులు చేయించే దిక్కులేదని విమర్శించారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.

మూడేళ్లు గడుస్తున్నా 150 గ్రామాల్లో ‘లక్ష్మణ్ కుమార్ మార్క్’ అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, కోటిలింగాల టూరిజం పనులు, యశ్వంతరావుపేట చెరువు, భీమన్న చెరువు (రూ.15 కోట్లు మంజూరైనా), మానేరు కాలువ, బొమ్మనరెడ్డిపల్లి ఎక్స్టెన్షన్ కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ​ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఫాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, మోహన్ రెడ్డి, రాసూరి శ్రీధర్, పుస్కూరి రామారావు, రాంచందర్ గౌడ్, మూగల సత్యం, పత్తిపాక వెంకటేష్, గొస్కుల జలేంధర్, ఆవుల సత్యం, వెంకట మాధవరావు, రియాజ్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>